Sunday, May 8, 2011

అవ్వొక రోజులూ!

నిజంగానే అవ్వొక రోజులు మరి, మళ్ళి రమ్మన్నా రావు! ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంటుంది. విజయవాడలో స్థానిక చిత్రకారులను నవయుగ ఫిలిమ్స్ వారు ప్రోత్సహించేవారు. 1960 లో చాలామంది చిత్రకారులు తయారయ్యారు. నా మిత్రుడు బ్రహ్మం , గవర్నర్ పేట, విజయవాడ రవీంద్ర కూల్ డ్రింక్స్ సెంటర్లో మేడమీద విజయ స్టూడియో వుండేది. అది వాళ్ళ అన్నయ్యది.

ఆతను ఈ సినిమా బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పేవాడు. నేనువేసిన సినిమా వాళ్ళ బొమ్మలు తీసుకెళ్ళి నవయుగ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్య గారిని (క్లిక్)
శ్రీ కాట్రగడ్డ నరసయ్య
కలిసాను (అప్పటికి నాకు 15 ఏళ్ళు). నన్ను సందేహంగా చూసారు. అమెరికా బ్రిటిష్ పత్రికలు కొన్ని ఇచ్చి వాటిల్లో యాడ్స్ చూడమన్నారు . వరండాలో బెంచిమీద కూర్చుని అన్నీ చూసాను. కాట్రగడ్డ నరసయ్య గారు చిత్రమైన మనిషి. సినిమాల పోస్టర్లల్లో ఆసక్తి కలిగించే "టీజర్లు" ఉంచటంలో ఆయన దిట్ట. కాని నేను తయారు చేసిన సినిమా ప్రకటనల్లో రాసిన వాక్యాలు నా సొంతం. చిత్రకారుని ప్రతిభ అక్కడేవుంది. వాటిని చూసే బొమ్మలను ఆమోదించేవారు.

సరే,ఆయన చెప్పినట్టు ఆ పుస్తకాలు క్షుణ్ణంగా చూసాను గంట-రెండు గంటల సమయం పట్టివుంటుంది. తర్వాత కలిసి చూశానని చెప్పాను. సినిమా ఫోటోలు కొన్ని ఆఫీసులో తీసుకుని, బొమ్మలు వేసి పట్టుకురమ్మన్నారు. మరునాడు ఫోటోలు అంటించి బొమ్మలు అక్షరాలు రాసి తాయారు చేసిన లే-అవుట్ చూపించాను. ఆ బొమ్మలు కింది బొమ్మల కొలువులో ఇవ్వబడినాయి. తర్వాత మరి కొన్ని సినిమాలకు వేసాను. పోస్టర్ డిజైన్ లు కూడా వేసాను. కులగోత్రాలు సినిమాకు నేను వేసిన పోస్టర్ అలంకార్ థియేటర్ లో 100 రోజులపాటు ప్రదర్శించారు.

చదువుకున్న అమ్మాయిలు 100 రోజుల పోస్టర్ నేను డిజైన్ చేసిందే. ఫోటోలు ఉంటేగాని బొమ్మలు వేయటానికి కుదరదు. కానీ సినిమా ఫోటోలు నాదాకా ఉండేవికావు. మంచివన్నీ సీనియర్ చిత్రకారులు పట్టుకుపోయేవారు.పోటీ బాగా వుండేది. అప్పట్లో నేను డిజైన్ చేసిన పోస్టర్ల మీద PRASAD KV అని ఆంగ్లంలో సంతకం చేసే వాణ్ని. కింద ఇచ్చిన బొమ్మల కొలువులో బొమ్మ చివరల్లో నా సంతకం చూడవచ్చు.

కథానాయకుడు, నాయకి ఫోటోలు మంచివన్నీ నా సీనియర్ చిత్రకారులు పట్టుకుపోయేవారు. నా దగ్గరకు వొచ్చేసరికి సహా నటీ నటుల ఫోటోలు మాత్రమే దక్కేవి. వాటితో ప్రకటనలు తయారుచేసేవాడిని. వీటిని దిన పత్రికల్లో వేసేవారు. ఒక్కొక్క దానికి రూ. అయిదు ఇచ్చేవారు. చిన్న పోస్టర్ డిజైన్ కి రూ. ఇరువై పెద్దదానికి రూ. ముప్ఫై ఇచ్చేవారు.

ఈ మధ్యలో కాలేజీ లో చేరాను. టైపు నేర్చుకోవటానికి ఇనిస్టిట్యూట్ లో కూడా చేరాను. అక్కడే భగవాన్ ని కలిసాను. అవి మానేసి కార్టూన్లు వెయ్యమన్నది అప్పుడే. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో పడ్డ కార్టూన్లకు ఒక్కొక్కదానికి రూ. ఏడు ఇచ్చేవారు. దానిని 1970 లో పది రూ. కు పెంచారు.
***************************************************
నేను తయారు చేసిన పోస్టర్ల బొమ్మల కొలువు






నేను తయారు చేసిన మరి కొన్ని పోస్టర్లు


నరసయ్య గారి ఫోటో tollywoodphotoprofiles.blogspot.com నుండి తీసుకోబడినది. వారికి కృతజ్ఞతలు

1 comment:

Vinay Datta said...

It's nice to know about you.

madhuri.