Friday, June 3, 2011

బాపు బాపు బాపు - జ్ఞాపకాలు



బాపు చిత్రకళా ప్రదర్శన,విజయవాడ, 1963
సంతకం అక్కర్లేని బాపు బొమ్మ
బాపు చిత్రకళా ప్రదర్శన మొదటిసారి 1962 జులైలో హైదరాబాద్ లో జరిగింది. బాపు అభిమానులయిన సెవెన్ స్టార్స్ సిండికేట్ వారు దీనిని దిగ్విజయంగా నిర్వహించారు.కాట్రగడ్డ నరసయ్య (నవయుగ ఫిలింస్)గారి ప్రోత్సాహంతో 1962 అక్టోబర్ లో బాపు చిత్రకళా ప్రదర్శన సంఘం ఒకటి విజయవాడలో ఎర్పాటయింది. అందులో పిళ్ళా (గీతా)సుబ్బారావు (శాస్త్రి)కార్యదర్శి అనిగుర్తు. (ఆయన ఆంధ్రప్రభ దినపత్రికలో 'చిత్రజగత్తు" శీర్షికతో రోజూ ఒక కార్టూన్ వెసి పాఠకులని అలరించేవారు.) ఇంకా ఇ.వి. రమణ (పాత అంధ్ర జ్యోతి), నేను, మరికొద్దిమంది కార్యవర్గంలో సభ్యులం.అప్పటికి మేమంతా సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టులమే.ప్రదర్శనకు సంబంధిత చర్చలు అలంకార్ థియేటర్ పై...అంతస్తులో జరిగేవి. కాట్రగడ్డ నరసయ్యగారు పర్యవేక్షణ,సూచనలు వుండేవి. 1962 నవంబర్ లో ఏర్పాటు కావలసిన ఈ ప్రదర్శన 1963 జనవరి 26 కి కుదిరింది. ఇంకొక ముఖ్య విషయం అదే రోజున (26 జనవరి 1963) జ్యోతి పత్రికను కూడా ప్రారంభించారు.

బాపు చిత్రకళా ప్రదర్శన ఏర్పాట్లలో నవోదయ రామమోహనరావుగారి పాత్ర చాలావుంది. బాపు బొమ్మలను చాలా జగ్రత్తగా చూసుకునేవారు. ప్రదర్శనా స్థలం-ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం. అక్కడ విశాలమయిన హాలులో చెక్క బద్దలకు క్లాత్ అమర్చి, దానిమీద బాపు బొమ్మలు (ఒరిజినల్స్)గుండుసూదులతో గుచ్చిపెట్టాము. రేపు ప్రదర్శన అనగా బాపుగారు ఆ రాత్రి 10-11 గం.సమయంలో అక్కడికి వచ్చారు. అప్పుడు మేము బొమ్మలు ఎక్కడ ఏవి ఉంచాలో , ఉంచుతూ , తీసివేసి మరో చోటికి మారుస్తూ సరి చేసుకుంటూ జోరుగా పనిలో వున్నాము.


ఆయన మా అందరితో కరచాలన చేస్తూ ఒక్కొక్కరికి 'థాంక్స్' చెప్పారు.అప్పటికే ఆయన వేసిన వేలాది(ఒరిజినల్స్)అక్కడ చూసి చూసి పరవశంలో ఉన్న నేను ఆయన కరచాలన చేయగానే గుండెపొంగినట్టయింది. ఓ గొప్ప చిత్రకారుణ్ణి ఆయన బొమ్మలమధ్య అనుకోకుండా చూడగలిగాను! ఆ కరచాలన మహత్మ్యం ఏమో ఈరొజున నేనూ ఓ కార్టూనిస్ట్ అనిపించుకోగలుగుతున్నాను.అప్పుడు ఆయన బొమ్మలు చూసి ఎంతో నేర్చుకున్నాను. ఆయన బొమ్మలు పత్రికలో ప్రచురించిన దానికన్న రెట్టింపు సైజులో వున్నాయి. అలా సాంకేతికంగా చాలా తెలిసాయి.

బాపు గీతలో అక్కినేని రూపం
మరునాడు ఉదయం అక్కినేని నాగేశ్వర రావు గారు ఈ ప్రదర్శనకు ప్రారంభోత్సవం చెశారు.సభ అట్టహాసంగా జరిగింది.అక్కినేని రాకవల్ల జనం విపరీతంగా వచ్చారు.సభ బయట ఖాళీ స్థలం లో ఏర్పాటు చేశారు. ప్రదర్శన హాల్లో వున్న మేముకూడా బయటకు రాలేకపోయాము.

ప్రదర్శన నాలుగైదు రోజులు జరిగినట్టు గుర్తు. అన్నిరోజులూ ప్రదర్శనను చాలమంది తిలకించారు. నేనుకూడా అన్నిరోజులూ ప్రదర్శనలోనే ఉన్నాను . అక్కడ వుంచిన బాపు చిత్రాలను ఎవరూ తాకకుండా చూడడం నాపని. ఇంకా కొంతమంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శన సందర్భంగా నవోదయ రామమోహనరవుగారి సారధ్యంలో తయారైన సావనిర్ కూడా విడుదల చేసారు.వెల ఒక రూపాయ మాత్రమే.అందులో ప్రముఖుల వ్యాసాలు క్లుప్తంగాను, బాపు బొమ్మలు విరివిగాను వున్న అపురూప పుస్తకం . నా దగ్గర ప్రతి [ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. మధ్య పుటలు వున్నాయి కాని ఓపక్క చెక్కముక్కలుగా విడిపోయినాయి.

బొమ్మే ప్రపంచంగా లీనమైపోయి చిత్రిస్తున్న శ్రీ బాపు
ఆ సావనీర్లో "The Artist at Work"-బాపుగారి ఫొటో వుంది. దానిని మీముందు వుంచుతున్నాను. ఆ సావనీర్ లో ప్రచురించిన ఆయన చిత్రాలు చూస్తూ ఉంటే (1955-60 మధ్య) ఆ బొమ్మల స్థాయికికూడా చేరుకున్న చిత్రకారులెవరు ఈ దేశంలో ఇప్పుడు కనిపించడంలేదు. ఆయన బొమ్మల్లో ఎప్పటికప్పుడు ఎదుగుదల తప్ప ఆగుదల లేదు.బాపుగారికి ఎవరి గుర్తింపూ అక్కరలేదు. ఆయన అభిమానులు అన్నిచోట్లా వున్నారు.

కాని ఒక గొప్ప తెలుగు చిత్రకారుడికి ఈ దేశంలో తగిన గుర్తింపు వచ్చేటట్టు చేయలేకపోతున్నామంటే అది మన తెలుగువాళ్ళ దౌర్భాగ్యం, వెనుకబాటుతనం!






బాపు గారి గురించిన వ్యాసం ముళ్ళపూడి గారి ఫోటో వెయ్యకపోతే అసంపూర్ణం కాదూ!!
ఈ అపురూప స్నేహితుల ఫోటోను ఈ కింద అందిస్తున్నాను


*********************************************************************
హైదరాబాద్ లో జూన్ 4 నుండి బాపు చిత్రకళా ప్రదర్శన వుంది. ఈ అద్భుత ప్రదర్శనను అందరూ ముఖ్యంగా బాలలు వర్ధమాన చిత్రకారులు తప్పకుండా చూడాలి!
ఐదు దశాబ్దాల క్రితం బాపు
అందుకోండి ఆహ్వానం



*********************************************************************

4 comments:

kaartoon.wordpress.com said...

బాబు గారు విజయవాడలో ఆనాడు జరిగిన బాపు కార్టూన్ ఎగ్జిబిషన్
గురించి వ్రాసినందుకు చాలా సంతోషం! ఆనాడు వెలువడిన సావనీర్
లో కొందరు కార్టూనిస్టుల పేర్లు కూడా ఒక పేజీలో వేశారు. ఆ పేర్లలో
మొదటి పేరు నాదే వుండటం (అప్పుడు నేను బాపట్లలో వుండే వాడిని)
నేను చేసుకొన్న అదృష్టం! ఆ పుస్తకం నేను పోగొట్టుకున్నాను.....
యమ్వీ అప్పారావు (సురేఖ)

శశి కళ said...

mee jnapakam choosi anandamatho vraasanu.mimmalanu anglamulo vraasi baadha pettalani kaadu.naa daggara telugu software ledu.sasi.nice posting.nice memory.

బాబు said...

అప్పారావు(సురేఖ)గారు,

నమస్తె. మీ పేరు నాకు బాగా గుర్తు. కాని ఎక్కడ చూసేనో ఇంతకాలం తెలియలేదు. బాపు చిత్ర కళా ప్రదర్శన, 1963 సావనీర్ నా దగ్గర ప్రతి శిధిలావస్థలో వుంది. దానిలో యువ చిత్రకారుల జాబితాలో మీ పేరు వుంది. నా పేరు పక్క పేజీలో వుంది. దీని గురించి మీకు రాద్దామనుకుంటూ వున్నాను.మీరే రాసారు. మీకో సంతోషకరమయిన వార్త -మిత్రులు శివ గారు ఆ సావనిర్ పూర్తి ప్రతిని మైల్ లో నాకు పంపించారు.మీకూ పంపిస్తాను.

బాబు said...

ధన్యవాదాలు!