Monday, August 15, 2011

షమ్మికపూర్ అన్ని వయసులవారిని అలరించిన గొప్ప నటుడు


షమ్మికపూర్ నా అభిమాన హిందీ నటుల్లో ఒకరు. నా మిత్రుడు సత్యానికి హిందీ సినిమాలంటే ఇష్టం.అది నాకూ అలవాటయింది.( నాకు హిందీ అంతగా రాదు అనేకంటే అసలు రాదు అని చెప్పడం ఉత్తమం). షమ్మికపూర్ నటించిన సినిమాలు దాదాపు అన్నీ చూశాను.


శంకర్ జైకిషన్, ఒ. పీ. నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతంతో మహమ్మద్ రఫీ పాటలతో - షమ్మీకపూర్ నటించిన సినిమాలు చూస్తే, హాయ్...హాయ్...గుండెలనిండా సంతోషంతో తనువు ఊగిపోయేది. రాజకపూర్, ఇతర ప్రముఖ నటుల సినిమాలకు భిన్నంగా వుండేవి షమ్మీ సినిమాలు. షమ్మీ సినిమాలు గొప్ప అనుభూతిని మిగిల్చేవి. "దిల్ తేరా దివాన హై సనం...." అంటూ వర్షం సన్నివేశంలో మాలాసిన్హా తో షమ్మీ మెలికలు తిరుగుతూ నాట్యం చేస్తోంతే...వూగిపోని ప్రేక్షకుడు వుండేవాడు కాదు. "కాష్మీరికి కలి" అనుకుంటాను, సాక్సోఫోన్ వాద్యంతో రఫీ గొంతుతో "యె దునియ కిసీకా ....జమానే కిసీకా ..." అంటూ షమ్మీ విషాదంగా పాడుతోంటే, గుండె బాధతో నిండిపోయేది.

తీస్రీ మంజిల్, బ్రహ్మచారి, జంగ్లీ... ఇలా అన్నీ అనాటి యువతను ఉర్రూతలూగించిన చిత్రాలే.ఇప్పటి యువతకయినా ఆ చిత్రాలు గొప్పగా నచ్చుతాయని నా నమ్మకం. ప్రేక్షకులని సంతోషంలో ఓలలాడించిన మహా నటుడు షమ్మీకపూర్.లక్షలాది మందిని సంతోషపెట్టిన షమ్మీకి తప్పకుండా ఆయన అత్మకు శాంతి కలుగుతుంది.

కొ స మె రు పు
మిత్రుడు భగవాన్ తో సినిమాకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాను. సినిమాకు వెళ్ళి చాలారోజులయింది...నేనుకూడా వస్తానురా! అన్నారు మా నాన్న. నాకు ఏం చెప్పాలో తోచలేదు. ఆరోజు మేమంతా షమ్మీకపూర్ (బ్రహ్మచారి) సినిమాకు తయారయ్యాం.
హిందీ సినిమాకు అని చెప్పాను ఆగుతారేమోనని. ఎదో ఒకటి అన్నారు మా నాన్న. ఆయనకి భగవాన్ అంటే ఎంతో ఇష్టం. భగవాన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత విషయం చెప్పి వేరే సినమాకి వెళదామనుకున్నాను.

"ఏయ్! సత్యం టికెట్లు కొనడానికి వెళ్ళేడు. ఈపాటికి కొనేసివుంటాడు.మీ నాన్నగారిని మనతోపాటు తీసుకెళదాం, కొంపలేమి మునగవు, అన్నాడు. మా నాన్న మా మిత్ర బృందంతోపాటు శేష్ మహాల్లో బ్రహ్మచారి సినిమా చూసేరు.

భగవాన్ వాళ్ళంతా జోకులేసుకుంటూ సినిమా చూసేరు. మా నాన్న నా ప్రక్కనే కూర్చోడంవల్ల నేను బలవంతంగా మౌనంగా వుండాల్సి వచ్చింది!! "ఎలావుందండీ సినిమా ?" మా నాన్నని అడిగేరు భగవాన్ హాలు బయటకు వచ్చేక . "సరదాగావుంది" అన్నారు మా నాన్న.
అవును, షమ్మికపూర్ అన్ని వయసులవారిని అలరించిన గొప్ప నటుడు!!

********************************
మిత్రుడు శ్రీ శివరామ ప్రసాద్ ఇలా అంటున్నారు:

నిజం! నిజం!! దుర్గా ప్రసాద్ గారూ. షమ్మీ కపూర్ మన భారతీయ సినిమాలో ఏకైక మ్యూజికల్ సినిమా హీరో అప్పటికి ఇప్పటికి మళ్ళి అటువంటి మ్యూజికల్స్ రాలేదు. ఏవో చౌకబారు అనుకరణలు ప్రయత్నించారు కాని, నప్పలేదు.

మాకొక కొలీగ్ ఉండేవాడు. మా కంటే చాలా పెద్దవాడు. మొహమ్మద్ యాసిన్. ఇప్పుడు కెనడాలో ఉంటున్నాడు. ఆయన చెప్పేవాడు. తాము చదువుకునే రోజుల్లో, హైదరాబాద్ లో "జంగ్లీ" సినిమా వచ్చిందని. ఆ "యాహూ" పాట కోసమే హాల్లో కి టిక్కెట్టు కొనుక్కుని, ఆ పాట ఐపోగానే వచ్చేశేవాళ్ళుట. అలా కొన్ని వారాలపాటు చూసారుట అంతటి క్రేజ్ షమ్మీ నటన అంటే.

నాకు తెలిసేప్పటికి షమ్మీ సినీ జీవితం చివర చివర్లో ఉన్నది. కాని ఆయన పాటలకు చెసే నృత్యాలు అద్భుతం. మరింకెవరూ చెయ్యలేరు. అప్పట్లో డాన్స్ మాస్టర్లు ఉండేవారో లెదో తెలియదు కాని, షమ్మీ పాటలకు తన కదలిక మొదలు పెట్టాక,షమ్మీనే కనిపించేవాడు. పాటలు ఆయన కోసం ప్రత్యేకంగ వ్రాసేరా అన్నంత చక్కగా నప్పేవి. పాటలో మొహమ్మద్ రఫీ కనిపించేవాడు కాదు, షమ్మీనే పాడుతున్నట్టుగా ఆయన నటన, తానె పాటను పాడుతున్నట్టుగా మెప్పించటం మరింకెవరికీ సాధ్య పడలేదు. మరే ఇతర హిందీ నటుడుకి ఇలా పాటలకు ప్రాణం పొయ్యటం చేతకాలేదు, ఏదో లిప్ మూమెంట్ ఇచ్చి అటూ ఇటూ నడుస్తూనో, హీరోయిన్ వెంట పొదల వేంటొ, చెట్ల చుట్టూనో పరిగెడుతూనో, లేకపోతే పియానో ముందు కూచునో, అయ్యింది అనిపించేవారు. పాట కోసం సినిమా చూశెవారు కాని, పాట అభినయించిన హీరో కోసం సినిమా చూడటం, ఒక్క షమ్మీ కపూర్ కోసమే. ఇప్పటికి కూడ పాట అభినయానికి ఏ హీరో సినిమాని చూస్తారని నేను అనుకోవటంలేదు. ఎప్పటికీ
షమ్మీ, ఏ తరానికైనా షమ్మీ ఒక్కడే అని నా అభిప్రాయం.

నిన్న రాత్రే షమ్మీ గురించి నా బ్లాగులో వ్రాద్దామని, ఆయన సినిమాల్లో నుంచి కొన్ని పాటలను కలిపి ఒక ఫైల్ తయారు చేశాను. ఈ కింది లింకు నొక్కి వినండి.




No comments: