నండూరి రామమోహనరావు గారు బెజవాడ లో అప్పుడు( 1960) కొత్తగా పెట్టిన ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా ఉండేవారు (మొదట నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకులు) తర్వాత దినపత్రికతోపాటు ఆంధ్రజ్యోతి వారపత్రిక కూడ ప్రారంభించారు. వారపత్రిక పనులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు చూస్తూ ఉండేవారు. శర్మగార్ని కలవడానికి తరచూ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళుతూ ఉండేవాణ్ణి. అక్కడ రామమోహనరావు గార్ని చూస్తూవుండేవాణ్ణి.ఆయనతో పరిచయం కలగలేదు చాలా రోజులు. ప్రసిద్ధ తత్వవేత్త బెట్రాండ్ రస్సెల్ మరణించినప్పుడు వెంటనే ఆయన బొమ్మ గీసి, ఆంధ్రజ్యొతి వీక్లీ పురాణం గారికి ఇచ్చేను. ఆ బొమ్మ వీక్లీ లో నండూరి వారి వ్యాసంతో ప్రముఖంగా ప్రచురించేరు. ఓసారి ఆంధ్రజ్యోతి సంక్రాంతి సంచికకు ఒక ముగ్గు కార్టూన్ వేసాను.అది ఆ సంచికకే 'హైలైట్' అని నండూరి వారు మెచ్చుకున్నారు. అప్పట్నించి కాస్త పరిచయం.1979 అనుకుంటాను మా గురువు బాపు గార్కి బెజవాడలో స్వాతి పత్రిక సంస్థవారు సన్మానం చేసారు. . ఆ సభకు ఆంధ్రపత్రిక శివలెంక రాధాకృష్ణ గారు ఓ అయిదునిముషాలు ఉండి వెళతాను అంటూ వచ్చేరు. అక్కడకి నందూరివారు అప్పుడే వచ్చేరు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకోకుండా వెళిపోతున్నట్టు తోచింది.వెంటనే నందూరివారి దగ్గరివెళ్ళి రెండు అడుగుల దూరంలో ఉన్న రాధాకృష్ణ గార్ని చూపించేను. ఇద్దరూ దగ్గరకుజేరి కరచాలన చేసుకున్నారు. తర్వాత నండూరివారు మరొకర్ని కలవడానికి వెళ్ళెరు. రాధాకృష్ణ గారు కూడ వెళతానంటే కారుదాకా వెళ్ళేను.వాళ్ళిద్దరూ చాలాసేపు మట్లాడుకుంటారు అనుకున్నాను. కాని వారి ఇద్దరి మధ్య చాలా కాలం పలకరింపులు లేవని తర్వాత తెలిసింది ఆ రోజే కాస్త పలకరించుకున్నారన్న మాట. రాధాకృష్ణ గారు రామమోహనరావు గారి అనువాదాల గురించి మెచ్చుకుంటూ చెప్పేవారు.ఆంధ్రపత్రికలో సమీక్షకోసం నండూరి వారి పుస్తకాలు వచ్చినప్పుడు రాధాకృష్ణ గారు అవి నాకు ఇచ్చేరు.ఆయన పుస్తకాలు సమీక్ష చేయడం నా అదృష్టం అనిపిస్తుంది.
ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ పనిమీద వచ్చినప్పుడు నండూరి వారిని కలిశాను. "మాకు ఆర్టిస్ట్ కావలసివచ్చి ప్రకటన ఇచ్చాము. బాబు పేరుతొ అప్లికేషను వస్తే అది మీరే అనుకోని కబురు చేసాం. తీరా చూస్తే అది మీరు కాదు. ఆయినా ఆతను వేసిన బొమ్మలు చూసి ఉద్యోగం ఇచ్చాం " అని నవ్వేరు.
ఓసారి బాపు గారు మెహది హసాన్ (పాకిస్తాన్ గాయకుడు) సంగీత కచేరికోసం హైదరాబాద్ వచ్చేరు. ఆయన్ని కలవడానికి నేనూ వెళ్ళేను. ఆయన దిగిన హోటెల్ గది ఆయన స్నేహుతులతో నిండిపోయింది. అక్కడ నండూరి గారు కూడ వున్నారు. ఆయన చేతిలో తర్వాతి వారం ఆంధ్ర జ్యొతి వీక్లీ కవర్ పేజీ వుంది. ఆ కవర్ పేజీ పై భాగంలో ఆంధ్రజ్యోతి పేరు, మధ్య భాగంలో ఓ సినిమా తార చిన్న కలర్ ఫొటో వుంది. కవర్ పేజీ లో ముప్పాతిక భాగం తెల్లగా వుంచేసారు. నండూరి గారు అక్కడున్న తన మిత్రులను కవర్ పేజీ మీద అభిప్రాయం అడిగేరు.దాంతో అందరూ తలాఒక జోకు వేయడం మొదలెట్టేరు. పాఠకులకు మంచి కానుక అన్నారు. ఆ తెల్లని భాగంలో రకరకాల పద్దులు రాసుకోవచ్చు అన్నారు. పిల్లలు లెక్కలు చేసుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత వీక్లీ మార్కెట్లోకి వచ్చింది. కవర్ పేజీలో కొద్ది మార్పు చేసారు. అదేవిటంటే తెల్ల భాగంలో చిక్కటి వేరే రంగు వేసేరు. ఆయన తన వృత్తిలో నవ్వులాటకు తావులేకుండా చూసుకొనే వారు అనడానికి ఇదొక నిదర్శనం. ఆయన ఎప్పుడూ గంభీరంగానే వుండేవారు.
ఓ పది పన్నెండేళ్ళ క్రితం శ్రీ స్వామి రామానంద (హిమాచల్) నాకు ఉత్తరం రాసేరు - నండూరి రామమోహన రావు గారు అప్పొల్లొ (హైదరాబాద్) ఆసుపత్రిలో వున్నారు, ఓసారి వెళ్ళి పలకరించిరండీ అని. నేనూ నా మిత్రులు వర ప్రసాద్ (అడ్వొకేట్) గారు ,ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పలకరించి వచ్చేము.తర్వాత శ్రీ స్వామి రామానంద ఓసారి హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చేరు. "నండూరిగారు ఇప్పుడు హైదరాబాద్ లో వున్నారు. ఆయన్ని చూసివద్దాం రండి" అన్నారు. స్వామిగారి వద్ద వున్న చిరునామా ప్రకారం చిక్కడపల్లి- నారాయణ గూడ దగ్గర్లొ వున్న ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసేము.
కాసేపు మాటల తర్వాత వారి విశ్వదర్శనం విశ్వరూపం రచనలు హింది లోకి అనువదించే ప్రసక్తి వచ్చింది. "వాటిని నేను హిందీలోకి అనువదించి పెట్టనా?" అడిగేరు స్వామిజీ. వెంటనే ఆయన నండూరి వారి తెలుగు రచన ఒకదానిని చేతుల్లోకి తీసుకుని హిందీ లో గడ గడా చదవడం మొదలెట్టేరు స్వామిజీ. నేను ఆశ్చర్యంగా చూస్తూ వుండిపొయేను. నండూరి గారు కూడ నాలాగే స్వామిజీని చూసేరు. "మిమ్మలే అనుకున్నాను, కొద్దిగా దిద్దుబాట్లు వున్నాయి. అవి చేసేక మీకిస్తాను" అన్నారు.స్వామిజి పూర్వాశ్రమంలో బెజవాడలో ఓ మాస పత్రికలో ఉప సంపాదకుడుగా వున్నారు. అది వారి ఇద్దరి మధ్యా వున్న పరిచయం.
చాలా రోజుల తరవాత బెజవాడ లబ్బీపెట వెంకటేశ్వర దేవాలయంలో ఒక పెళ్ళిలో నండూరి గారిని కలిసేను. ఆయన స్వామిజి గురించి అడిగేరు. "ఆయన హిమాచల్ లోనే వున్నారు. ఆరోగ్యం అంతగా బాగోలెదు , విశ్రాంతి
తీసుకుంటున్నారు " అని చెప్పేను.
ఆ తర్వాత స్వామిజీ 2001 నవంబర్లో పూర్తి విశ్రాంతి తీసుకున్నారు. వారి గురించి మరెప్పుడైనా రాస్తాను.
ఆమధ్య హాస సభలో ఒకరు ఓ సంఘటన జోకు రూపంలో చెప్పేరు. నండూరి గారు ఓసారి మద్రాస్ వెళ్ళి బపు రమణల గారితో ఓరోజు వున్నారట . తర్వాత ఆయన బెజవాడకు బయలుదేరుతొంటే "కొంపలేం మునిగిపోవు, రెండు రోజులు వుండి వెళుదురుగాని....ఏం? మీరు లేకపొతే ఆంధ్రజ్యోతి పేపరు ఆగిపోతుందా?"అన్నారట బాపు-రమణలు. దానికి ఆయన " లేదు.... నేను లేకుండా పేపర్ వస్తుందేమోనని ....."అన్నారట.
తమ సైన్సు రచనలని చందమామ కథల్లా అందరిచేతా చదివించిన ఘనత నండూరివారిదే.
నండూరి గారు గొప్ప నిజాయితీగల సంపాదకులు, రచయిత. ఆయనకిదే నివాళి.!!
1 comment:
నండూరి వారి గురించి మీ పరిచయం , ముళ్లపూడివారు తమ బావగారిని (వారి శ్రీమతి శ్రీదేవిగారు నండూరి వారి సోదరి) ఆహ్వానిస్తున్నట్లు
మీరు గీసిన చిత్రం చాలా బాగున్నాయి.ధన్యవాదాలు.
Post a Comment