Tuesday, December 13, 2011

మరికలేని మన మారియో మిరండా


 (1926 - 2011
మారియో మిరండా కార్టూన్లు చాలా ప్రత్యేకంగా వుంటాయి. కార్టూన్ మొత్తం తుంపు లేని రేఖతో వుంటుంది. కావలసిన చోట అడ్డ నిలువు గీతలతో మొత్తం   బొమ్మలో  వెలుగు నీడలు తీసుకురావడం  అయన ప్రత్యేకత.  ఆయన  కార్టూన్, ఖాళీ స్థలం అంటూ లేకుండా, మేఘాలు, వాన, దీపాల వెలుతురూ(ఇవన్ని సన్నటి లావు గీతలతో),  జన సమూహంతో  నిండిపోతుంది .  ఇక రంగుల చిత్రాలయితే, ఆయన ఎన్నుకునే రంగులు , వాటి మేళవింపు కన్నుల విందు చేస్తాయి.  Illustrated Weekly  of India లో  జోకుల కాలంలో విదేశి కార్టూన్ లేనప్పుడు  ఆయన  కార్టూన్ వుండేది. అ పత్రికలో  ఆయన కథలకు బొమ్మలు వేసేవారు. ఆయన  ఫిలింఫేర్ పత్రికలో  ఐ.ఎస్. జోహార్  ప్రశ్న-జవాబులు  శీర్షికకు కార్టూన్లు వేసినట్టు  గుర్తు.  సినిమాల  మీద ఆయన ఎన్నో కార్టూన్ లు వేసారు.  

ఆర్.కే లక్ష్మణ్ కార్టూన్లు  మధ్య తరగతి విషయాల మీద అయితే , మారియో  కార్టూన్లు పట్టణ, నగర వాసుల మీద, వాణిజ్య  వర్గాల మీద ఉండేవి.  మొదట్లో నేను మారియో  లా   బొమ్మలు వేయడానికి ప్రయత్నించేను.   కాని ఆ పద్ధతికి  ఎక్కువ  సమయం పట్టేది. అందుచేత విరమించేను.  


 "Friends, Countrymen, lend me your years!"   (మిత్రులారా, సాటి పౌరులారా, మీ ఆయుష్షు నాకివ్వండి!").ఆంగ్లం లో  ear కు బదులు  year వాడడం ఈ కార్టూన్ లోని హాస్యం. ఇలాంటి పద విన్యాసాల కార్టూన్ లు అయన చాల వేసారు.  ఓ కార్టూన్ లో   'Mother  tongue' బదులు  'Murder tongue' అని  వాడి  చురక వేసారు. 
    

                                                                     










ఆయన వేసిన రంగుల చిత్రాలు ఎంత అందంగా వున్నాయో  చూడండి!

     








మారియో మిరండా  పూర్తీ పేరు Mario Joao Carlos do Rosario de birtto Miranda.  అయన  గోవాలో పానాజికి దగ్గరగా వున్నా లోతులిం  గ్రామంలో 1926 లో జన్మించారు. వారి పూర్వికులు  300  సంవత్సరాల క్రితం కట్టిన విశాలమయిన భవంతిలో ఆయన  పుట్టి పెరిగారు. ప్రముఖ దర్శకులు శ్యాం బెనగల్  ఓ సారి అ భవంతికి వెళ్లి  చూసి అదే నేపథ్యం  మీద "త్రికాల్" చిత్రాన్ని 27  సంవత్సరాల క్రితం తీసారు.  మారియో పూర్వికులు సారస్వత బ్రహ్మణులు. 1750  లో రోమన్ కేథలిక్  మతం పుచ్చుకున్నారు. 

మారియో చిన్ననాటి నుంచే బొమ్మలు వేయడం ప్రారంభించారు. (బొమ్మలు వేయడం చిన్నతనంలోనే వస్తుంది). తోటి విద్యార్థులు చెబితే టీచర్ల మీద బొమ్మలు వేసేవారు.  ఇంటి గోడలన్నీ తమ గీతలతో నింపేవారు. వాళ్ళ అమ్మగారు అదిరిపడి వెంటనే బొమ్మలు గీయడం కోసం  పుస్తకాన్ని కొని పెట్టి, గోడలమీద బొమ్మలు గీయడం ఆపించేరు. 

మారియో చిన్న ప్రాధమిక  విద్యాభ్యాసం గోవాలో జరిగింది.  St. Xavier's  కాలేజి  ముంబై లో  బి.ఏ. (చరిత్ర)చదివారు. తర్వాత IAS  అవ్వాలని కోరుకున్నారు. కాని, తలిదండ్రుల కోరిక మేరకు ఆర్కిటెక్ట్ కోర్సు  లో చేరారు. 
అది కూడా సాగలేదు. 
     
1953 లో  టైమ్స్ ఆఫ్ ఇండియా లో కార్టూనిస్ట్ గా చేరారు. .1960 లో Illustrated Weekly of India లో చేరారు. కొన్ని సంవత్సరాలు పోర్చుగల్, ఓ అయిదేళ్ళు లండన్ లో వార్తా పత్రికల్లో పని చేసారు.  1974 లో  అమెరికన్ కార్టూనిస్ట్  Charles M. Schulz (Peanuts  - పీనట్స్ సృష్టికర్త )తో  కలిసి  పనిచేసారు.  ఆయన కార్టూన్లు   MAD, PUNCH   లో కూడా వచ్చేవి. 22  దేశాల్లో ఆయన చిత్రాల ప్రదర్శన జరిగింది. అందులో  USA, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా , ఫ్రాన్సు, సింగపూర్ , యూగోస్లావియా, పోర్చుగల్ వున్నాయి.      బ్రిటిష్ కార్టూనిస్ట్  Sir Ronald Searle  ని గురువుగా  మారియో  భావించారు. 

1980  లో భారత దేశానికి తిరిగి వచ్చేక, ఎకనామిక్ టైమ్స్ , ఇతర పత్రికల లోను కార్టూన్ లు  వేయడం ప్రారంభించారు. ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు అందించారు.  పెద్ద పెద్ద  సంస్థల   క్యాలెండరు లకు  చిత్రాలు వేసారు.   

ఆయన సృష్టించిన కార్టూన్  పత్రాలు మిస్ నింబుపాని , మిస్ ఫోన్సెకా ప్రాచుర్యం పొందాయి. ఎకనామిక్ టైమ్స్ లో బాస్-సెక్రటరీ  పాత్రల్లో  రోజూ ఒక కార్టూన్ వుండేది   మచ్చుక్కి  ఒక కార్టూన్:
  • బాస్ తన సెక్రటరి తో అంటాడు " I don't buy newspapers. I buy editors!" (నేను వార్తా పత్రికలను కొనను. టి  సంపాదకులను కొంటాను") 
  •  అలాగే మరొక కార్టూన్:  Filmfare  లోనో  Illustrated Weekly of India  లోనో వచ్చింది. అదొక సినిమా పోస్టర్. హీరో , హీరోయిన్ నడుము పట్టుకుని ఉంటాడు. సినిమాపేరు  'How the waist was won' అని రాసి వుంటుంది. నటీనటులు   Rockhardsun,   Urusula undress అని కూడా వుంటుంది.
  •  సినిమా How the west was won,   Rock  hudson, Urusula Andrews  కి  అయన చేసిన హాస్యభరిత  మయిన  మార్పులు ఇవి. 

మారియో మిరండా ను  భారత ప్రభుత్వం 1988  లో పద్మశ్రీ,  2002  లో పద్మభూషణ్ బిరుదులతో  సత్కరించింది. 

 చాలా కాలం అనారోగ్యం తో బాధపడి   11-12-2011 (శనివారం రాత్రి) నిద్రలో నిష్క్రమించారు. ఆయన భార్య హబీబా  హైదరి . కుమారుడు రిషాద్ ,  హెయిర్  స్టైలిస్ట్ గా  న్యూయార్క్ లో వున్నారు. రెండో  కుమారుడు  కార్టూనిస్ట్ గా గోవా లోనే  వున్నారు. 

 శ్యాం బెనగల్ తో పాటు మరి కొంతమంది ప్రముఖులు ' మారియో పేరు తప్ప డబ్బు సంపాదించు కోలేదు. వారి భార్యకు కష్ట కాలమే మరి'  అన్నట్టు వార్తలు వచ్చేయి.  ఆధునిక చిత్రకారు లు   కొద్దిమంది కోటీశ్వరులకే దగ్గరవుతారు. కాని, కార్టూనిస్ట్ కోట్లాది సామాన్యులకు దగ్గరవుతారు.  ఆ విధంగా  మారియో మిరండా భాగ్యశాలిఅని చెప్పుకోవాలి. 

కార్టూన్ కళ వ్యాపకానికే  తప్ప వృత్తి గా పనికిరాదని ఎప్పట్నించో నా వ్యక్తిగత అభిప్రాయం. మారియో మిరండా లాంటి గొప్ప కార్టూనిస్ట్  కి  కూడా అదే పరిస్థితి రావడం  విచారకరం.  ఈ విషయం అందరికి తెలియాలని    నా ఆలోచన . కొన్నేళ్ళ క్రితం   ప్రముఖ రచయిత ఆదివిష్ణు  నాకూ,  ఎర్రంసెట్టి సాయికి   " గురూ!  పత్రికల్లో గాని , సినిమా రంగంలో గాని, మనకి ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా  మన ఉద్యోగాలు మాత్రం వదలకూడదు " అని గట్టిగా  చెప్పారు.  అది  తలచుకుంటే అతనికి ఎంత దూర దృష్టి ఉందోనని పిస్తుంది. ఒకసారి నేను కూడా (  కొద్దిపాటి పెన్షన్ తో )  ఉద్యోగం మానేసి కార్టూనిస్ట్ గా పత్రికలో  చేరిపోదామని ఉగెను.  కాని శివలెంక రాధాకృష్ణ గారు వారించారు.  అలా   నన్ను కాపాడేరు


                                                           
                                 కార్టూనిస్ట్ మారియో  మిరిండా గారికిదే  నివాళి.

3 comments:

వేణు said...

మారియో బొమ్మలూ, కార్టూన్లూ విలక్షణం. గీతలతో పాటు చుక్కలను ఆయన ఉపయోగించే తీరు బాగుంటుంది. మారియో మిరండా ప్రత్యేకత, హాస్య చతురతలను గుర్తు చేస్తూ మీరు రాసిన ఈ టపా ఆయన కృషికి చక్కటి నివాళి!

A K Sastry said...

బాబుగారూ!

మేరియో గురించి అందరికీ తెలియని విషయాలని చక్కగా వ్రాశారు. చాలా సంతోషం!

ధన్యవాదాలు.

ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక!

బాబు said...

వేణు గారికి, కృష్ణ శ్రీ గారికి ధన్యవాదాలు.