భోగి పండుగనాడు మిత్రులు కార్టూనిస్ట్ జయదేవ్ ని ఫోన్ లో పలకరించాను. పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నాం. తర్వాత జయదేవ్ "ఏం, ప్రసాద్ ! శ్రీరామరాజ్యం సినిమా చూసావా? " అని అడగ్గా, 'లేద'ని చెప్పాను. "అరరే, నువ్వు చూడాలి ప్రసాద్. గురువుగారు చాలా గొప్పగా తీసారు. నువ్వూ తనూ వెళ్ళండి. నేనూ ఈ మధ్యనే చూసాను. "అనగా, "అదే, చూద్దాం అనుకుంటున్నాను." అన్నాను వాయిదా వేసే పద్దతిలో. "నీ సందేహం అర్ధమయింది, సినిమా చాలాబాగుంది, చూడు" అన్నారు. "సరే, నువ్వు చెప్పావు కాబట్టి, ఈపూటే వెళతాం" అన్నాను
బాపు అభిమానినైన నేను ఆయన సినిమాలు 'సాక్షి' మొదలు దాదాపు అన్నీ చూసాను. ఓసారి మిస్టర్ పెళ్ళాం షూటింగు సమయంలో బాపుగార్ని కలిసాను. కొద్దిపాటి విరామ సమయం లో బొమ్మలకు రంగులు వేయడం గురించి (వ.పా. గురించి చర్చకు వచ్చినప్పుడు) చెప్పారు. తర్వాత షూటింగ్ పద్దతి చూసాను. బొమ్మ గీసినట్టు చకచక జరిగిపోతుంది.
శ్రీరామరాజ్యం నేను మా ఆవిడతో చూద్దామని విడుదలయిన మొదటి రెండు మూడు రోజులు ప్రయత్నించాను. వీలుపడలేదు. క్యూ లో నిలబడే ఓపిక లేక దూరభారాలవల్ల చాలా ఏళ్ళుగా సినిమాలు చూడడం మానేసాం, నేనూ మా ఆవిడా. నేనొక్కడనే ఎప్పుడయినా వెళతాను, చాల మంచి సినిమా అనంటే , అదీ అది వెళ్లి పోయేముందు.
ఇప్పుడు జయదేవ్ చెప్పాకా, ఇక వెళ్ళడమే మంచిది అనుకున్నాను. మా ఆవిడకు చెప్పాను. "నాకిప్పుడు వీలుపడదు. మీరు వెళ్ళిరండి" అని భోజనం పెట్టి బయటకు తోసేసింది, మళ్ళీ వాయిదా వెయ్యకుండా. మాట్నీ సమయానికి థియేటరుకు చేరుకొని , టికెట్ కొనుక్కొని లోపలి కెళ్ళి కూర్చున్నాను. అప్పటి వరకు టీవీ లో ఏళ్ళతరబడి కరాటే (తెలుగు)సినిమాలు చూసి చూసీ మొద్దుబారి పోయిన మెదడుతో , బండబారిన గుండెతో ఉన్న ప్రేక్షక మహా శయుల లో ఒకడిని అయిన నాకు ఈ పౌరాణికం చూడగలనా అని బెంగ మొదలయింది. వెంటనే సినిమా మొదలయింది.
అంతే!
ఒక అత్భుత రంగుల ప్రపంచం లోకి అడుగు పెట్టినట్టయింది నాకు. అయోధ్య రాజ వీధులు , శ్రీరాముని మందిరాలు , వాల్మికి ఆశ్రమం.....అన్ని ...అన్నీ కళాత్మకం! అపురూపం !! నాకు అక్కడ శ్రీరాముడు సీత కనిపించారే తప్ప బాలకృష్ణ నయనతార కాదు ( ఈవిషయంలోనే మొదట నేను సందేహ పడ్డది). నటులంతా బాపు కదిపిన బొమ్మలు. మహానుభావుడు రమణగారు వ్రాసిన మాటలతో నిండిన సన్ని వేశా లన్నీ గంభీరం, రాజసంతోనే కాక కరుణ రసంతో నిండి వున్నాయి. ఏవో బండ రాళ్లు తప్ప గుండె ఉన్న వారికి కంట నీరు తెప్పిస్తాయి. పాటలు, సంగీతం ఎంత హాయిగా వున్నాయో !!! చిత్రం మొత్తం మీద ఒక్క క్షణం కూడా విసుగు అనిపించలేదు.
'పురుషులందు పుణ్య పురుషులు వేరయా...' అన్నట్టుగా, సినిమాలందు బాపు శ్రీరామరాజ్యం సినిమా వేరు. ఇలాంటి చిత్రాన్ని చూడటానికి గుండెకు కళాత్మక కళ్ళు ఉండాలి. 'సీతాకల్యాణం' తర్వాత సాంకేతిక పరంగా మరింత గొప్పగా తీసిన చిత్రం. రేపు టీవీ లో కాక ఇప్పుడే థియే టర్లో చూడాల్సిన చిత్రం.
రావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు సముద్రపు ఒడ్డున శిలపై కూర్చుని ఉంటాడు. వెనుక సముద్రపు అలలు , ఆ అలల మధ్య శిలలు.... ఆ ఒక్క
' ఫ్రేం ' నా మస్తిష్కంలో బాగా ముద్ర పడిపోయింది.
' ఫ్రేం ' నా మస్తిష్కంలో బాగా ముద్ర పడిపోయింది.
ఫోటోలు: మూవీస్ సులేఖ.కాం &
సినిగోయర్ సౌజన్యం తో
7 comments:
సరేనండీ మీదృష్టిలో "రేపు టీవీ లో కాక ఇప్పుడే థియే టర్లో చూడాల్సిన చిత్రం" కాదని యెవరంటారు!
ఇలాంటి చిత్రాన్ని చూడటానికి గుండెకు కళాత్మక కళ్ళు ఉండాలి అన్నారే! నాకైతే కళాత్మక కళ్ళు లేవు
సమాసం సరిజేసి చూసినా కళాత్మకనేత్రాలూ లేవనుకుంటాను. అందుకే 'లవకుశ' లాంటి సినమానుగూడా చూడగలిగిననేని యీ కళాఖండాన్ని చూడలేకపోతున్నాను. మీరన్నట్లు నా గుండె బండరాయేమో. పాటలు, సంగీతం ఎంత హాయిగా వున్నాయో మీకు కాని టీవీలో పదేపదే వేసిబాదుతున్న 'జగదానందకారకా' అనే పాట నాకు పరమకర్ణశులాయమాణంగా ఉంది. పౌరాణికం చూడగలనా అని బెంగ నా కెప్పుడూ లేదు. కాని ఇది చూసే ఆసక్తికూడా లేదు. అయితే, ప్రత్యేకించి యెందు కామాట వ్రాయటం అంటే ప్రత్యేకించి యెందుకు మీరు ప్రచారసామాగ్రిలాంటి రివ్యూ వ్రాసారో అందుకే. వెయ్యిన్నొకటోసారి ఇలాంటి రివ్యూ చదివి వెయ్యిన్నొకటో నా చిరాకునూ తెలియజేసుకోవలసి వస్తోంది. బాపూ తీయటమొకటే అర్హతకాదు మంచి సినిమా తీయటానికి!
బాబు గారికి, మీరు మరోసారి శ్రీమతిగారితో చూడండి. శ్రీరామరాజ్యం గురించి చక్కగా చెప్పారు. నేనెవరిని పలుకరించినా "బాగున్నారా" అనికాదు. "శ్రీరామరాజ్యం" చూశారా అనే.
బాబు గారూ! ‘శ్రీరామరాజ్యం’ చూసిన మీ అనుభూతిని చక్కగా వ్యక్తం చేశారు. మీ మస్తిష్కంలో ముద్రపడిపోయిన ఫ్రేమ్ నాకూ నచ్చింది.
ఈ సినిమాకు ఇళయరాజా అందించిన (నేపథ్య) సంగీతం ప్రత్యేకత గురించి ఆ మధ్య రెండు భాగాల పోస్టు రాశాను. వీలుంటే చూడండి- http://venuvu.blogspot.com/2011/12/2.html
wow
బాగుందండీ..
బాబూ...మీ బ్లాగ్ చూసాను. చేయి తిరిగిన మీ కార్టూనుల గురించి కొత్తగా పొగడాలంటే మాటలు వెదుక్కోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మీ గీతల ఆంతర్యాన్ని.. అంద చందాలని ఎరిగినవాడిని కదా. ఆ తర్వాత బొమ్మలతో పాటు ..బ్లాగ్ లోని బాపూ గారి శ్రీరామ సామ్రాజ్యం రివ్యూ చూసాను. భూత భవిష్యత్ వర్తమానాలలో బాపూగారి బొమ్మలను చూసి స్పందించని వాళ్ళూ ...తన్మయులు కాని వాళ్ళూ..ఎవరూ వుండరు. అందమైన అమ్మాయి కనిపిస్తే...బాపూ బొమ్మరా ...అంటూ ఆ మహనీయుడిని గుర్తు తెచ్చుకోని తెలుగు వాడూ కనిపించడు. ఈర్ష్యా అసూయా దోషాలవల్ల...బాపూ బొమ్మని ఎవారైనా తిడితే .. దైవీ భూత మైన .యావత్ చిత్ర కళనూ దూషించిన పాపం చుట్టుకుని ...నిజంగా నరకం అనేది వుంటే అక్కడకి వెడతాడు. అలాగే ఎందరికో ఆదర్శ ప్రాయమయిన బాపూ రమణల కళాత్మక స్నేహ బంధం కూడా ..తెలుగు సారస్వత , చిత్రలేఖన రంగాలలో అపురూపమైనదే. చలనచిత్ర విభాగంలో కూడా వారిద్దరి కృషితో వెండితెర ఇంతకూ ఇంతగా మెరిసిన గతమూ మనమెరుగుదుము.. కానీ శ్రీరామ సామ్రాజ్యం విషయం లో మాత్రం ప్రేక్షకుడు ఆ అనుభూతిని నేను పొందలేక పోవడం నిజం.. అది గతంలో చూసిన లవకుశ[మొదటిది పారుపల్లి సుబ్బారావు గారు ,సత్యనారాయణగారు ,శ్రీరంజని మొదలైన వారిది...రెండోది రామారాగారు, అంజలీదేవి, నాగయ్య గార్ల ] సినిమాల ప్రభావం కావచ్చు. సరే వర్తమాన సామ్రాజ్యం లో ....నటీ నటులందరూ దిగ్దంతులే. సాక్షాత్తు దర్శకుడు ఇక్కడ ఇంకా బాగా చేయాలి అని చెప్పినా ...మనఃపూర్వకంగా ఒప్పుకోలేని నటనానుభవాన్ని ప్రోది చేసుకొన్నవారే. కాక వారి వారి అనుకూలతలను సమర్ధించుకుని శాసించ కలిగిన వారే. ఎవరైనా ఇది మంచి..ఇది చెడు అని చెప్పినా..వ్రాసినా... కొసనవ్వుతో పెడచెవిని పెట్టేవారే. కనుక దర్శకత్వంలో సైతం.... కుంచె తప్ప ...కొరడా పట్టుకునే అలవాటు లేని బాపూ గారు చేయగలిగింది ఏమీ లేదు. అస్సలే నిర్లిప్తుడు.. అందునా మధ్యలో ముళ్ళపూడి వారి హటాన్మరణం..కూడా బాపూగారికి మరింత నిర్లిప్తతకు కారణ భూతమయిందేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఇక కళా దర్శకునికి ప్రేరణగా , బాపూ ఝుళిపించిన కుంచె నయనాందకరమైన పెద్ద పెద్ద సెట్టింగుల ద్వారా ద్యోతక మవుతూనే సినిమా నడిచింది. ఆ ప్రభావ ఫలితంగా ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోగానే తొలిసీను అబ్బ అనిపిస్తుంది. ఆపైన వివిధ పాత్రలు ప్రవేశానంతరం....పాత లవకుశ చిత్రాల నటీ నటులు హృదయాన కదులాడి .....మొదటి అబ్బ ...క్రమేపీ దూర మై పోయింది. ఇక ఆ మొదటి శీను శ్రీరామచంద్రుడి అయోధ్యా నగర ప్రవేశం. గజారోహణాది హంగు ఆర్భాటాలతో సాగుతూ....ఇళయరాజా వారి సంగీతం లో జొన్నవిత్తుల వారు వ్రాసిన .. జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ....పల్లవి సద్గురు త్యాగరాజ స్వామివారు నాట రాగంలో చేసిన ప్రఖ్యాత పంచరత్న కీర్తన నుంచి తీసుకున్నది మిగిలిన పాట..పాటలు వారి స్వయంకృతం. మాటలు ఎవడబ్బ సొమ్మూ కావు కానీ ...అంత పాట వ్రాసిన జొన్నవిత్తుల వారి మేధో ఘంటం పల్లవి కాస్త స్వంతంగా కూర్చ లేకపోయిందా ?అనిపిస్తుంది .రామాయణం మీద పట్టూ , శ్రీరామచంద్రుడి చేపట్టూ వున్న బాపూగారి లాటి దర్శకులు అలాటి ప్రయోగాలను ప్రోత్సహించకుండా వుంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. వర్తమాన ట్రెండు అంటారు అదేమో తెలియదు కానీ ... ఒక్క మొదటి హడావిడి తప్ప ఇళయరాజాగారు స్వరపరిచిన పాటలు...పాత పాటలకు దిష్టి తీసేసినట్లున్నై. హీరోల పైన యెంత అభిమానం వున్నా...వర్తమాన యువతకు పౌరాణికాలు చూపించడం చాల కష్టమే. శ్రీమద్రామాయణానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఈకాలంలో రామచంద్రుడి కధ ఎవడికి కావాలి. ఎవరైనా చూస్తె ..వాళ్ళు.... జీవిత భానుడు నడిమింటిని దాటినవారే. వాళ్ళని మనసులో ఉంచుకుని సామ్రాజ్య స్థాపన జరిగి వుంటే బావుండేదేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా థియేటర్లను విడచి ...బుల్లి తెర మీదకి కూడా ప్రవేశించింది. ఇక్కడేమో పోటానుపోటిగా నడుస్తున్న బుల్లితెరలు పాత లవకుశ తర్వాత కొత్త సామ్రాజ్యం ప్రసారం చేస్తూ మరో సారి అభిమానుల చేత అబ్బే అనిపిస్తున్నై. సరే నిర్మాత సమర్ధుడైన ధనికుడే కాబట్టి... సినిమా ఎలా వున్నా నటీ నటులు లెక్క చేయరు కాబట్టి... ఇంత విచారించ వలసిన అగత్యంలేదు. అయినా ఈ అవలోకనాలు, అవధారణలు ఎందుకంటే ... ఇది అందరూ విపరీతంగా అభిమానించే మన బొమ్మల బాపూ సినిమా కాబట్టి. అంతే మరొకటి ఐతే , వర్తమాన సినిమాలను గురించి ....ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. యోగి వేమన గారన్నట్లు "కోతి పట్టము కట్టి కొత్త పుట్టము కట్టి కొండ ముచ్చు లెల్ల కొలిచినట్లు" ముక్త కంఠం తో సెహభాష్....సెహభాష్...అనడమే.
బాబూ...మీ బ్లాగ్ చూసాను. చేయి తిరిగిన మీ కార్టూనుల గురించి కొత్తగా పొగడాలంటే మాటలు వెదుక్కోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మీ గీతల ఆంతర్యాన్ని.. అంద చందాలని ఎరిగినవాడిని కదా. ఆ తర్వాత బొమ్మలతో పాటు ..బ్లాగ్ లోని బాపూ గారి శ్రీరామ సామ్రాజ్యం రివ్యూ చూసాను. భూత భవిష్యత్ వర్తమానాలలో బాపూగారి బొమ్మలను చూసి స్పందించని వాళ్ళూ ...తన్మయులు కాని వాళ్ళూ..ఎవరూ వుండరు. అందమైన అమ్మాయి కనిపిస్తే...బాపూ బొమ్మరా ...అంటూ ఆ మహనీయుడిని గుర్తు తెచ్చుకోని తెలుగువాడూ కనిపించడు. ఈర్ష్యా అసూయా ద్వేషాలవల్ల... బాపూ బొమ్మని ఎవరైనా తిడితే .. దైవీభూతమైన యావత్ చిత్ర కళనూ దూషించిన పాపం చుట్టుకుని ... నిజంగా నరకం అనేది వుంటే అక్కడకి వెడతాడు. అలాగే ఎందరికో ఆదర్శ ప్రాయమయిన బాపూ రమణల కళాత్మక స్నేహ బంధం కూడా .. తెలుగు సారస్వత, చిత్రలేఖన రంగాలలో అపురూపమైనదే. చలనచిత్ర విభాగంలో కూడా వారిద్దరి కృషితో వెండితెర ఇంతకూ ఇంతగా మెరిసిన గతమూ మనమెరుగుదుము.. కానీ శ్రీరామ సామ్రాజ్యం విషయం లో మాత్రం ప్రేక్షకుడిగా ఆ అనుభూతిని నేను పొందలేక పోవడం నిజం.. అది గతంలో చూసిన లవకుశ [మొదటిది పారుపల్లి సుబ్బారావు గారు ,సత్యనారాయణగారు ,శ్రీరంజని మొదలైన వారిది... రెండోది రామారావు గారు, అంజలీదేవి, నాగయ్య గార్ల ] సినిమాల ప్రభావం కావచ్చు. సరే వర్తమాన సామ్రాజ్యంలో .... నటీ నటులందరూ దిగ్దంతులే. సాక్షాత్తు దర్శకుడు ఇక్కడ ఇంకా బాగా చేయాలి అని చెప్పినా ... మనఃపూర్వకంగా ఒప్పుకోలేని నటనానుభవాన్ని ప్రోది చేసుకొన్నవారే. కాక, వారి వారి అనుకూలతలను సమర్ధించుకుని శాసించ కలిగినవారే. ఎవరైనా ఇది మంచి..ఇది చెడు అని చెప్పినా..వ్రాసినా... కొసనవ్వుతో పెడచెవిని పెట్టేవారే. కనుక దర్శకత్వంలో సైతం.... కుంచె తప్ప ...కొరడా పట్టుకునే అలవాటు లేని బాపూ గారు చేయగలిగింది ఏమీ లేదు. అస్సలే నిర్లిప్తుడు.. అందునా మధ్యలో ముళ్ళపూడి వారి హటాన్మరణం కూడా బాపూగారి మరింత నిర్లిప్తతకు కారణ భూతమయిందేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఇక కళా దర్శకునికి ప్రేరణగా , బాపూ ఝుళిపించిన కుంచె నయనాందకరమైన పెద్ద పెద్ద సెట్టింగుల ద్వారా ద్యోతకమవుతూనే సినిమా నడిచింది. ఆ ప్రభావ ఫలితంగా ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోగానే తొలిసీను అబ్బ అనిపిస్తుంది. ఆపైన వివిధ పాత్రలు ప్రవేశానంతరం.... పాత లవకుశ చిత్రాల నటీ నటులు హృదయాన కదులాడి .....మొదటి అబ్బ ...క్రమేపీ దూరమైపోయింది. ఇక ఆ మొదటి శీను శ్రీరామచంద్రుడి అయోధ్యా నగర ప్రవేశం. గజారోహణాది హంగు ఆర్భాటాలతో సాగుతూ....ఇళయరాజా వారి సంగీతంలో జొన్నవిత్తుల వారు వ్రాసిన .. జగదానందకారక జయ జానకీ ప్రాణనాయకా ....పల్లవి సద్గురు త్యాగరాజ స్వామివారు నాట రాగంలో చేసిన ప్రఖ్యాత పంచరత్న కీర్తన నుంచి తీసుకున్నది మిగిలిన పాట.. పాటలు వారి స్వయంకృతం. మాటలు ఎవడబ్బ సొమ్మూ కావు కానీ ... అంత పాట వ్రాసిన జొన్నవిత్తుల వారి మేధో ఘంటం పల్లవి కాస్త స్వంతంగా కూర్చలేకపోయిందా ?అనిపిస్తుంది. రామాయణం మీద పట్టూ , శ్రీరామచంద్రుడి చేపట్టూ ఉన్నా బాపూగారి లాటి దర్శకులు అలాటి ప్రయోగాలను ప్రోత్సహించకుండా వుంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. వర్తమాన ట్రెండు అంటారు అదేమో తెలియదు కానీ ... ఒక్క మొదటి హడావిడి తప్ప ఇళయరాజాగారు స్వరపరిచిన పాటలు... పాత పాటలకు దిష్టి తీసేసినట్లున్నై. హీరోల పైన యెంత అభిమానం వున్నా... వర్తమాన యువతకు పౌరాణికాలు చూపించడం చాల కష్టమే. శ్రీమద్రామాయణానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఈకాలంలో రామచంద్రుడి కధ ఎవడికి కావాలి. ఎవరైనా చూస్తే .. వాళ్ళు.... జీవిత భానుడు నడిమింటిని దాటినవారే. వాళ్ళని మనసులో ఉంచుకుని సామ్రాజ్య స్థాపన జరిగి ఉంటే బావుండేదేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా థియేటర్లను విడచి ... బుల్లి తెర మీదకి కూడా ప్రవేశించింది. ఇక్కడేమో పోటానుపోటిగా నడుస్తున్న బుల్లితెరలు పాత లవకుశ తర్వాత కొత్త సామ్రాజ్యం ప్రసారం చేస్తూ మరోసారి అభిమానుల చేత అబ్బే అనిపిస్తున్నై. సరే నిర్మాత సమర్ధుడైన ధనికుడే కాబట్టి... సినిమా ఎలా వున్నా నటీనటులు లెక్క చేయరు కాబట్టి... ఇంత విచారించవలసిన అగత్యంలేదు. అయినా ఈ అవలోకనాలు, అవధారణలు ఎందుకంటే ... ఇది అందరూ విపరీతంగా అభిమానించే మన బొమ్మల బాపూ సినిమా కాబట్టి. అంతే. మరొకటి ఐతే, వర్తమాన సినిమాలను గురించి .... ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. యోగి వేమన గారన్నట్లు "కోతి పట్టము కట్టి కొత్త పుట్టము కట్టి కొండ ముచ్చు లెల్ల కొలిచినట్లు" ముక్త కంఠంతో సెహభాష్....సెహభాష్...అనడమే.
Post a Comment