Monday, September 1, 2014

బాపు--రమణ ఇప్పుడు --బాపు--రమణ .


బాపు నాకు గురుదేవులు . ఇప్పుడు దేవుడయ్యారు .  31-8-2014 సాయంత్రం ఆయన ఇక లేరు అన్న వార్త మా పెద్ద అబ్బాయి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే లేచి టీవీ పెట్టాను . అన్ని ఛానెల్స్ ఆయన మరణవార్త ప్రసారం  చేస్తున్నాయి .

     నా కార్టూన్ ల పుస్తకం "ఇవే మన పద్యాలు"  పోయిన ఏడాది పంపించాను .  అది అందిన మరుసటి రోజే నాకు ఫోన్ చేసి పలకరించారు . పుస్తకం చాలా బాగుందని మెచ్చుకున్నారు. అది ఆయన గొప్ప మనసు. "సార్ , స్వయంగా వచ్చి పుస్తకం మీకు ఇద్దామను కున్నాను . కాని నా ప్రయాణ కార్యక్రమం ఆలస్యం అవుతోందని , కొరియర్ లో పంపేను .  మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను " అన్నాను . తప్పకుండ రండి అన్నారు.
ఆయనలా ఫోన్ చేస్తారనుకోలేదు . ఉత్తరం రాస్తారనుకున్నాను. అందుకే సంతోషం తో ఎక్కువ మాట్లాడలేక పొయాను.  తర్వాత కొన్ని రోజులకి ఆయనకి  భార్యా వియోగం కలిగింది . వెళ్లి పలకరించాలని అనుకున్నాను - కాని వీలులేక పోయింది  నా సామాన్య సంసార బాధ్యతలతో .

    మొన్న ఉగాది ఉదయం ఆయనకు ఫోన్ చేశాను శుభాకాంక్షలు చెబుదామని .ఆయన ఫోన్ ఎత్తి "బాబు ... మీతో మళ్ళీ మాట్లాడతాను " అని ఫోన్ పెట్టేశారు . అదే నాతో ఆయన ఆఖరి మాట . తర్వాత మిత్రులు  జయదేవ్ కి ఫోన్ చేసాను - బాపు గారిని ఒక సారి చూడాలని .  ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు , సమయం చూసి చెప్తాను, అప్పుడు వద్దువు గాని అనడంతో , వేచి చూస్తూ వున్నాను.  ఈ వినాయకచవితి పండగ రోజులు అయినాక , ఆయన్ని తప్పకుండ చూసి రావాలనుకున్నాను. కనీసం ఆయన ఇంట్లో దూరంగా నుండి అయినా చూసి రావలనుకున్నాను.  అలా అనుకునే లోపే , ఆయన అందరిని వీడిపోయ్యారు .
 
   ఆయన గురించి ఎన్నో చెప్పాలనివుంది .  నేను కొంచెం కోలుకున్నాక చెప్తాను.

   ఈ పై ఫోటో  స్వాతి బలరామ్ గారు బాపు గారికి (1979?) విజయవాడ లో సన్మానం చేశారు .  అప్పడు బాపు గారితో నేను ...



  

No comments: