Monday, September 26, 2016

వాన కాదు ..వానకాదు ...వరదా రాజా....!

   రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం పదిరోజులుగా  ఎడతెరిపిలేని వర్షాల కారణంగా , అన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి .  వాగులు , నదులు పొంగిపొర్లడంతో ,  రోడ్లు, రైలు మార్గాలు  దెబ్బతిన్నాయి .  రాకపోకలు నిలిచిపోయాయి .  వాహనాలు  నీట మునిగాయి .  బస్సులు, లారీలు  నీటి మధ్య  నిలిచిపోయాయి .  అందులోని ప్రయాణికులను రక్షించగలిగారు .  విజయవాడ వద్ద , ప్రకాశం బ్యారేజి  కృష్ణవేణి శక్తిని తట్టుకోలేక , గేట్లు ఎత్తివేసింది . బ్యారేజీకి ఇరువైపులా  కృష్ణవేణి సముద్రాన్ని తలపింపజేచింది .  విజయవాడ ప్రజలకి , కృష్ణవేణి నిండుగా  ప్రవహించడం కన్నులపండువ చేసింది . శ్రీశైలం,  నాగార్జున సాగర్  లు కూడా  , పూర్తిగా నిండిపోయి , నీటిని నిరంతరం బయటకి వదలాల్సి వచ్చింది   జలసంపద పెరిగింది .  కొంత ఆస్తి , పంట నష్టం కూడా జరిగింది

    తెలంగాణా లో కూడా అన్ని నీటి ప్రాజెక్టులు  పూర్తిగా నిండిపోయాయి . జంట నగరాలైయిన , హైదరాబాద్  - సికింద్రాబాద్ జలమయమయ్యాయి .  చాలా చోట్ల  రోడ్లు నడుం లోతు  నీటిలో వున్నాయి .  వాహనాలు నీటిలో ఆగిపోయాయి .  టీవీ చానెల్స్ లో చూస్తే  , పరిస్థి తి  దారుణంగా  కనిపించింది .  చెరువుల్లో కట్టిన వందలాది అపార్టుమెంటు లు ,  ఒక్కొక్కటీ  ద్వీపంలా కనిపించాయి .  హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయి ,  జనాన్ని భయపెట్టింది .అపార్టుమెంటు  వాసులు  రాకపోకలకు మార్గం లేక విలవిలా లాడిపోయారు .  నీరు పోయే మార్గం లేక , గ్రౌండ్ ఫ్లోర్ లు నిండిపోయాయి .  నిత్యావసరాల కోసం   చాలా ఇబ్బంది పడ్డారు .  రోడ్లు బాగా దెబ్బతిన్నాయి .   ఎడతెరిపిలేని వర్షాలవల్ల , నిస్సహాకులకి  సాయం అందజేయటం కూడా కష్టమయిపోయింది .  ఇల్లాంటి వానలు గత 20-30 సంవత్సరాల్లో  చూడలేదని కొంతమంది అంటున్నారు .
    చివరకు నిన్న (25-9-2016) సూర్యదేవుడు కనిపించాడు  .   మునిగిన కాలనీ ల నుండి , నీటిని  యంత్రాల ద్వారా  బయటకు తోడిపోయటం మొదలు పెట్టారు .  యధాస్థితికి , మరో వారం పట్టవచ్చు
    

No comments: