Sunday, April 10, 2011

అవినీతిని అంతమోందిస్తా!

"అవినీతిని అంతమొందిస్తా!" అన్నాడు నీతిపరుడు, పెద్ద బండ మీద నిల్చుని. ఆ బండ చుట్టూ నిలబడ్డ జనం "ఏదీ మరొక్కసారి అను" అన్నారు.

"అవినీతిని అంతమొందిస్తాను " అన్నాడు, నీతిపరుడు. "భళిరే! హిప్పిప్ హుర్రే!" అరిచారు జనం ఆనందంగా, ఆవేశంగా, అవేదనగా, ఆక్రోశంతో! నీతిపరుడు ఒరలోంచి కత్తి లాగి గాల్లో ఊపాడు. జనం మళ్ళీ హో హో అన్నారు.

అక్కడ ఉన్న నలభై రెండు మంది జనంలో ఓ ముసలాడు దగ్గుతూ అడిగాడు, "పోయినెడాది, ఇట్టనే ఒకడు శపథం చేసి పోయినాడుగంద, వాడిగతి ఏవయినట్టూ?"

"అవినీతిని అంతమొందించటం అంటే మాటలా? దానికి చాలాకాలం పట్టుద్ది! ఆడు అప్పుడే తిరిగిరాడు. ఆడిది బక్కప్రాణంగంద?" అన్నాడు మరొకదు జవాబుగా.

"ప్రతోడూ అవినీతిని అంతమొందిస్తా అని బయలుదేరటమే కాని, మనమంతా నీతిగా బతుకుదాం అని చెప్పేవాడు లేడు గందా " అని ఓ పండు ముసలి గొణిగాడు.

ఆ నలభై రెండు మంది జనంలోని ముసలమ్మలు నీతిపరునికి హారతులిచ్చారు. పూలు జల్లారు. వీర తిలకం పెట్టారు. కాసేపు నాట్యం చేశారు. అక్కడి అడవిలో దొరికిన పళ్ళని అతని గుర్రం మీది సంచీలో కుక్కి పెట్టారు.

"జిగిబిగి" అంటూ వీరుడు మళ్ళీ బండరాయి ఎక్కి, ఒక్క వుదుటున గుర్రం మీదకు దూకాడు. అదొక్కసారి క్రిందికి కూలబడి, ఎట్టాగో అట్టా తట్టుకుని లేచి పరుగెత్తింది. జనం అంతా నిట్టూర్పులు విడుస్తూ, ఎవరి గుడిసెల్లోకి వారు వెళ్ళిపోయారు. నీతిపరుడు చెట్టులు, పుట్టలు, గుట్టలు, చిట్టడువులు, మహారణ్యాలు దాటుకుంటూ వెళ్ళిపోసాగాడు. జనం ఇచ్చిన పళ్ళను కొరుక్కు తింటూ గుర్రాన్ని అదిలించసాగాడు. "నీ సొమ్మేంపోయింది, పరుగేట్టేది నేనుగదా, సరే కానీ నిన్ను పడేసే వేళ రాకపోతుందా" అనుకుంటూ గుర్రం కసి కసిగా పరిగెత్తసాగింది .

"ఆన్నట్టు, ఏంటి ఇట్టా పడిపోతున్నాడు తను? తను ఎక్కడికి వెళ్ళాలి? అవినీతిని అంతమొందిస్తానని చెప్పా? అయితే అదెక్కడుంది? అడగటం మర్చిపోయానే. ఎంత అశ్వశక్తి వృధ్ధా అయిపోతోంది. సరే, ఎవడైనా దార్లో కనపడకపోతాడా వాడ్ని అడుగుదాం" అనుకున్నాడు నీతిపరుడు. అనుకున్నట్టుగానే, దార్లో ఓ మనిషి కనిపించాడు. నీతిపరుడు గుర్రాన్ని ఆపి, ఆ మనిషిని అడిగాడు, "ఏమయ్య! అవినీతి ఎక్కడుంది?"

అతను ఆశ్చర్యంగా చూసాడు. తన గడ్డాన్ని పొట్టదాకా లాక్కుని సవరించుకుంటూ అన్నాడు, "చూడు నాయనా! అది నీలో ఉంది, నాలో ఉంది. ఇందుగలదు అందు లేదు అన్న సందేహం లేదు. ఎందెందు వెదికిన అందందే గలదు" అన్నాడు.

వీడెవడో పిచ్చాడు అనుకుని గుర్రాన్ని ముందుకు పోనిచ్చాడు నీతిమంతుడు. అట్లా మళ్ళీ చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, చిట్టడవులూ, మహారణ్యాలూ దాటుకుంటూ పోసాగాడు. అట్టా పోగా పోగా, బాగా చీకటిపడ్డ సమయంలో, ఓ పెద్ద మైదానం చేరుకున్నాడు. కాస్త దూరం పోయాక ఒక పెద్ద భవనం కనిపించింది. దాన్ని చూడగానే, నీతిపరుడ్ని అక్కడకి తీసుకెళ్ళి పడేద్దామనుకుని గుర్రం చాలా వేగంగా హుషారుగా పరుగెత్తింది.

భవనం చేరుకోగానే అక్కద బోలెడుమంది కిన్నెరలు కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికారు. అతన్ని గుర్రం మీంచి దించి పూలు జల్లుతూ, వాటిమీద నడిపించుకుంటూ, భవనంలోకి తీసుకెళ్ళారు. గుర్రం విశ్రాంతి దొరికినందుకు తెగ సంతోషించి సకిలించింది.

నీతిపరుడు భవనం యొక్క మెరుపుల్నీ, అందాల్ని, చూస్తూ మైకంతో నడవసాగాడు. అట్లా ఎన్నో గదులు దాటాక, ఒక పెద్ద గదిలోకి తీసుకు పోబడ్డాడు. ఎదురుకుండా ఓ అప్సరస! ఆమె నీతిపరుడుకి చెయ్యి అందించింది. నీతిపరుడు అది గొప్ప అదృష్టంగా ఆమె చెయ్యిని వెంటనే అందుకున్నాడు. ఇద్దరూ ఓ పెద్ద పడక గదిలోకి వెళ్ళారు. ఆమె, అందాలు వొలికిస్తూ శయనించింది.

నీతిపరుడు ఆమె అందాల్ని ఒక్కటొక్కటే చూస్తూ, "ఆహా! ఏమి విశాల నేత్రాలు? మొన తేలిన ముక్కు, పల్చటి, ఎర్రటి పెదాలు, నునుపైన బుగ్గలు. కొంచెం పొడుగ్గా మెరిసిపోతున్న మెడ, ఎత్తైన రొమ్ములు, ఏ చేతికైన చిక్కే నడుము...." ఆమె నీతిపరుడ్ని మీదకు లాక్కుంది. సుఖంలో మునిగిపోయి, వారం రోజుల తరువాత తేలాడు నీతిపరుడు.
తన బుగ్గల్ని ఆమె బుగ్గలకానించి, "ప్రియా, నీ పేరేంటి?" అడిగాడు. "అవినీతి" అంది. "అబ్బ! ఎంత అందమైన పేరు, మరి ఈ రాజ్యం పేరు". "అవినీతిపురం". "అబ్బ ఎంత అందమైన పేరు? ఇక్కడ జనం అంతా చాలా అందమైనవారే అయి వుండాలి" అన్నాడు నీతిపరుడు.

"అందుకు సందేహమా, కొందర్ని చూపిస్తాను పద!" అంది అవినీతి. నీతిపరుడు లేచాడు, ఎదురుగా ఓ బలిష్టమైన వీరుడు వచ్చాడు."ఇతను నా సోదరుడు. పేరు అవినీతిపరుడు" అంది ముందుకు సాగుతూ, అతన్ని చూసి భయపడ్డాడు నీతిపరుడు.

"అవిగో అక్కది జనం చూశావా? వాళ్ళంతా లంచాలు తీసుకునేవారు. అదిగో ఇక్కడ జనాన్ని చూశావా? వీళ్ళంతా కట్నాలు కానుకలతో బతికేవాళ్ళు. అదిగో అక్కడ...ఇక్కడ కొంతమంది జనం ఉన్నారు చూశావా? వాళ్ళు బీదవాళ్ళని దోచుకునేవాళ్ళు. వాళ్ళ స్థలాలు ఆక్రమించుకునే వాళ్ళు. వీళ్ళు దొంగతనాలు, హత్యలు చేసేవాళ్ళు, అదిగో వాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళూ. ఇదిగో వీళ్ళు దబాయించి బతికేవాళ్ళూ....." అంది అవినీతి. అబ్బ! ఇంత అందమైన వాళ్ళని నేను ఎక్కడా చూళ్ళేదు. అవునుమరి అతనెవరు? ఏమిటో తనలో తానే మాట్లాడుకుంటున్నాడు " అడిగాడు నీతిపరుడు.

"అతనా? తను గొప్ప నీతిపరుడ్ని అని ఉపన్యాసం ఇస్తున్నాడు?!!" అంది

అతను ఇక్కడ వుండటం తమాషాగావుందే?! అన్నాడు. "ఇందులో తమాషా ఏముంది?
అబధ్ధాలాడటం కూడా అవినీతిలో భాగమే కదా? అంది.

అంతలో అక్కడకి ఓ భటుడు పరుగెత్తుకుంటూ వచ్చి "అవినీతి రాణీ వందనములు! మన

వేగులవాళ్ళు తెచ్చిన వార్త, అవినీతిని అంతమొందిస్తానని శపథం చేసి ఓ నీతి సింహుడు
బయలుదేరాడట...." అన్నాడు. "ఆ సింహం సంగతి మేం చూస్తా! నువ్విక వెళ్ళవచ్చు" అంది అవినీతి. భటుడు వెళ్ళిపోయాడు.

"ప్రియా, వారం రోజులు నాకు వేరే పని ఉంది నువ్వు విశ్రాంతి తీసుకో, నీకు ఏ లోటూ లేకుండా నా చెలికత్తెలు చూస్తారు" అంది వెళ్ళిపోతూ.

నీతిపరుడు తల విదిలించుకున్నాడు, "అవినీతిని అంతమొందిస్తా........అవినీతిని
అంతమొందిస్తా....." ఈ శపథం ఎక్కడో విన్నట్టుగా వుందే? ఎవరు ఏ సందర్భంలో
చేశారు?.....ఏమిటో లీలగా గుర్తు వుంది....బహుశా తనకు పోయిన జన్మ జ్ఞాపకాలు
వస్తున్నాయా?

==============================================
ఎప్పుడో 1987 సంవత్సరం ఆగష్టు లో అప్పట్లో వచ్చే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో నేను "గిరజాల గిరీశం" అనే కలం పేరుతొ వ్రాసిన కథ మళ్ళీ మీ కోసం
==============================================




1 comment:

బాబు said...

అతను కర్తవ్యం మరిచాడు. కత్తి దాని కత్తవ్యం మరిచి తలకిందులయింది. దీనిని బొమ్మలో ఎవరూ గమనించినట్టు లెదు.