
మిత్రుడు శివరామప్రసాద్ కప్పగంతు తన బ్లాగులో ప్రచురించిన రిక్షాపై కవిరాజు(క్లిక్) వ్యాసం నుండి పై ఫోటో. ఒరిజినల్ గా ఈ ఫోటో హిందూ పత్రికలో ప్రచురించబడినది
నా చిన్నతనంలో ఆయన్ను చాలాసార్లు చూసాను. మా సీతారామపురానికి ఆయన మారుతీనగర్ కి ఫర్లాంగ్ దగ్గర. ఏలూరు రోడ్ మీద రిక్షాలో వెళుతూ కనిపించేవారు. ఆయన కనిపించినప్పుడల్లా అదిగో విశ్వనాథ గారు, విశ్వనాథ గారు అనుకుంటూ వుండేవాళ్ళం నేనూ నా మిత్రుడు సత్యం.
ఓసారి మేమిద్దరం ఆకాశవాణి ఉగాది( 1962-65 మధ్య )కవిసమ్మేళ నానికి వెళ్ళాం. ఆ సాయత్రం అక్కడ ఎందఱో కవులను చూసే భాగ్యం కలిగింది. ఆ సభలో అందరూ కవితలు చదివారు. అప్పుడు విశ్వనాధ వారు ఆనాటి కవిత్వం గురించి ఆ సభలో కొన్ని విమర్శలు చేసారు. సినారె నొచ్చుకున్నారు, అలిగి వెళ్ళబోయారు. కొంత గడబిడ జరిగింది. తర్వాత విశ్వనాథ వారు తమ స్వరం తగ్గించడంతో సద్దుమణిగి సభ విజయవంతంగా ముగిసింది.
కాలేజీ లో చేరిన తర్వాత వేయిపడగలు గ్రంధం లయబ్రరినుండి తెచ్చుకుని పదిహేను రోజులకి 100 పుటలు మాత్రమే చదవగలిగాను. ఆలస్యమయితే కోప్పడతారని ఆ గ్రంధాన్ని తిరిగి ఇచ్చేసాను. మళ్ళీ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సీరియల్ గా వేసినప్పుడు చదివాను.
శివలెంక రాధాకృష్ణ గారు ఓసారి ఇలా చెప్పారు. విశ్వనాథ వారిని గుంటూరు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి సరిగాలేదు. చాలామంది ఆయన్ని చూడడానికి వెళ్లారు. ఒకాయన విశ్వనాథ వారిని కలిసి "డాక్టర్ తో మాట్లాడాను. భయం లేదన్నారు." అన్నారు. దానికి విశ్వనాథ వారు "చచ్చే వాడికి నాకు భయం గానీ, వాడికెందుకు ఉంటుంది!!" అన్నారట. ఆరోజే ఆయన పోయారట. ఇది 1976 లో.
1 comment:
మీ జ్ఞాపకాలు చాలా బాగుంటున్నాయి బాబు గారూ. అలనాటి అనేక విషాలు తెలుస్తున్నాయి. మీరు మరిన్ని జ్ఞాపకాలు మా అందరికీ తెలియచేయాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ విశ్వనాథవారు చివరి రోజున వేసిన జోక్ తెలియచేసినందుకు ధన్యవాదాలు.
Post a Comment